Supreme Court: హిందూ-ముస్లిం వివాహాలపై కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు!

  • ముస్లిం భర్త ఆస్తిపై భార్యకు హక్కు ఉండదు
  • కానీ ఆమె భరణం పొందవచ్చు
  • కుమారుడు తండ్రి ఆస్తికి వారసుడవుతాడు

ఓ మతాంతర వివాహం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధంలో అమ్మాయికి భర్త ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శాంతనగౌడర్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఆమె భరణం పొందేందుకు మాత్రం అర్హురాలని తెలిపింది. ఈ దంపతులకు పుట్టిన కుమారుడికి తండ్రి ఆస్తిపై అందరిలాగే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొంది.

ఈ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. కేరళకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి షంషుద్దీన్ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి చనిపోవడంతో అత్తింటివారు వీరిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో షంషుద్దీన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి ఆస్తిని తమకు ఇప్పించాలని కోరారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తల్లికి ఆస్తిపై ఎలాంటి హక్కు లేకపోయినా భరణం పొందవచ్చని తెలిపింది.

సాధారణ పెళ్లిలాగానే ఇలాంటి అరుదైన మతాంతర వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తండ్రి ఆస్తిపై సంపూర్ణ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో ఇలియాజ్ తండ్రి తరఫు బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలియాజ్ భార్య హిందువు కాబట్టి ఆస్తి దక్కదని వాదించారు. వీరి వాదనలను తిరస్కరించిన ధర్మాసనం.. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

  • Loading...

More Telugu News