paruchuri: 'అసెంబ్లీ రౌడీ' సక్సెస్ కి బ్రహ్మానందం కామెడీ కూడా ఒక కారణం: పరుచూరి గోపాలకృష్ణ
- బ్రహ్మానందానికి కామెడీ ట్రాక్ రాశాము
- అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది
- ఆయనలో గొప్పనటుడు వున్నాడు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ .. బ్రహ్మానందం కామెడీని గురించి మాట్లాడారు. బ్రహ్మానందం నటించిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాను గురించి ప్రస్తావించారు. "దర్శకుడు బి. గోపాల్ తన సినిమాలకి సెపరేటుగా కామెడీ ట్రాక్ రాయించుకునేవారు. 'అసెంబ్లీ రౌడీ' విషయంలోనూ ఆయన అదే పద్ధతిని పాటించారు. 'అసెంబ్లీ రౌడీ' సక్సెస్ కి నాలుగు కారణాలున్నాయి. ఒకటి మోహన్ బాబు నటన .. డైలాగ్ డెలివరీ. రెండవది బి. గోపాల్ దర్శకత్వం .. మూడవది దివ్యభారతి అందాలు .. నాల్గొవ కారణం బ్రహ్మానందం కామెడీ.
ఈ సినిమాలో 'పాకీజా' అంటూ ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ సినిమా సెన్సార్ కి వెళ్లేముందు చూస్తే లెంగ్త్ వేయి అడుగులు తగ్గింది. దర్శకుడు గోపాల్ .. మోహన్ బాబు అందుబాటులో లేరు. అప్పుడు గోపాల్ నాకు ఫోన్ చేసి .. 'బ్రహ్మానందం - పాకీజాపై కొన్ని సీన్లు రాసేసి మీరే డైరెక్ట్ చేసేయండి .. టైమ్ లేదు' అన్నారు. అలా నేను బ్రహ్మానందాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయనలో ఎంతటి అద్భుతమైన నటుడు ఉన్నాడనేది ప్రత్యక్షంగా చూశాను. ఆ కామెడీ ట్రాక్ కి వచ్చిన రెస్పాన్స్ మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.