Andhra Pradesh: హైదరాబాద్ లో 11 మందిని చంపించారన్న ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి!
- అప్పట్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది
- ప్రతిపక్షంలో ఉన్న నేనెలా చంపించగలను?
- కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోంది
ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని షాకింగ్ కామెంట్లు చేశారు. దీనికి మతకలహాల రంగు పులిమారని విమర్శించారు. తాజాగా ఈ వివాదంపై కిషన్ రెడ్డి స్పందించారు.
2014, మే 13న ఈ ఘటన జరిగిందని సయ్యద్ షుజా అనే హ్యాకర్ చెప్పాడు, మరి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో వుంది కదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారంలో 11 మందిని ఎలా చంపించగలనని నిలదీశారు. ఈ వ్యవహారంలో అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
లండన్ లో జరిగిన హ్యాకర్ మీడియా సమావేశానికి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ హాజరైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదనీ, ఏపీ, తెలంగాణలో హత్యలకు పాల్పడింది కాంగ్రెస్ నేతలేనని దుయ్యబట్టారు.