nia: జగన్ పై దాడి కేసు డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వలేం: కోర్టుకు తెలిపిన సిట్ అధికారులు
- ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం
- హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది
- దీన్ని విచారించే అర్హత కింది కోర్టుకు లేదు
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ఏపీ పోలీసులు విచారిస్తున్న తరుణంలో... కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తోంది. మరోవైపు, కేసు విచారణ డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని సిట్ అధికారులను ఎన్ఐఏ అధికారులు కోరారు. అయితే డాక్యుమెంట్లను ఇవ్వడానికి సిట్ అధికారులు నిరాకరించారు. దీంతో, విచారణకు సిట్ సహకరించడం లేదని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ పిటిషన్ వేసింది. దీంతో, ఎన్ఐఏకు డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ సిట్ అధికారులను ఈ నెల 19న కోర్టు ఆదేశించింది.
అయితే, కోర్టు తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు జరిగిన విచారణలో తమ విచారణ డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వలేమని కోర్టుకు సిట్ తెలిపింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారమని... దీనికి సంబంధించి కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉందని... దీంతో, దీనిని విచారించే అర్హత కింద కోర్టుకు లేదని సిట్ అధికారులు తమ వాదనలను వినిపించారు.