Arunachal Pradesh: ఏలకులను తీసుకుపోలేదట... సైనిక హెలికాప్టర్ ను అడ్డుకున్న 11 గ్రామాల ప్రజలు!
- అరుణాచల్ ప్రదేశ్ లో ఘటన
- ఏలకుల రవాణా ఒప్పందంపై ఏఎల్జీని శుభ్రపరిచిన ప్రజలు
- తీసుకెళ్లకపోవడంతో ఆగ్రహంతో చాపర్లను ల్యాండింగ్ కానివ్వని వైనం
తమ ఏలకులను రవాణా చేయలేదన్న ఆగ్రహంతో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ను 11 గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్ లాంగ్ జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆహార శాఖ మంత్రి కమలాంగ్ మోసాంగ్ మీడియాకు తెలిపారు. గడచిన మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న అడ్వాన్స్ డ్ ల్యాండింగ్ గ్రౌండ్ (ఏఎల్జీ) వద్దకు హెలికాప్టర్ల రాకపోకలు సాగించలేదని, దీంతో హెలీపాడ్లన్నీ పాడై పోయాయని చెప్పారు. ప్రస్తుతం దాని అవసరం సైన్యానికి ఏర్పడటంతో ఆ ప్రాంతాన్ని బాగు చేయడానికి 11 గ్రామాల ప్రజలు కృషి చేశారని అన్నారు.
తాము పండించే ఏలకుల ఉత్పత్తులను మియావో ప్రాంతానికి తీసుకెళ్లాలన్న ఒప్పందంపై వారు హెలీప్యాడ్లను శుభ్రం చేశారని, అయితే, సైనిక హెలికాప్టర్లలో ఏలకులను తీసుకెళ్లేందుకు నిరాకరించడంతోనే గ్రామ ప్రజలు చాపర్లను అడ్డుకున్నారని చెప్పారు. తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు పక్కనే ఉన్న మియావోకు వీరు వెళ్లాల్సివుంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో వీరు దాదాపు 157 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సివుంటుంది. హెలికాప్టర్ లో అయితే, సులువుగా చేరుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రజలు ఏఎల్జీని శుభ్రపరిచారని కమలాంగ్ తెలిపారు.