Priyaanka Gandhi: కాంగ్రెస్ తొలి కుటుంబం నుంచి ఎవరెవరు, ఎప్పుడు ఏ పదవితో రాజకీయాల్లోకి వచ్చారంటే..!
- 1919లో మోతీలాల్ నెహ్రూతో ప్రారంభమైన కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ
- ఆపై ఎంతో మంది గాంధీల చేతుల్లో పార్టీ బాధ్యతలు
- తాజాగా ప్రియాంకా గాంధీ రాజకీయ అరంగేట్రం
నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 11వ వ్యక్తిగా ప్రియాంకా గాంధీ నిలిచారు. ఆమెకన్నా ముందు వారి ఫ్యామిలీ నుంచి 10 మంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి వివరాలు...
1919లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడాయన వయసు 58 సంవత్సరాలు. ఆ తరువాత 1929లో జవహర్ లాల్ నెహ్రూ తన 40 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఆయన తరువాత ఫిరోజ్ గాంధీ 1952లో రాయ్ బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేయడం ద్వారా తన 40 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆపై ఇందిరా గాంధీ తన 42 ఏళ్ల వయసులో 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నిక కాగా, సంజయ్ గాంధీ 1980లో అమేధి నుంచి తన 33 ఏళ్ల వయసులో ఎంపీగా పోటీ చేశారు. ఆ మరుసటి సంవత్సరమే 1981లో రాజీవ్ గాంధీ అమేధి నుంచే పోటీ చేసి తన 37 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేశారు.
ఆయన తరువాత 1984లో మేనకా గాంధీ అమేధి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆమె వయసు 28 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్ కుటుంబం నుంచి మరో నేత రాజకీయ అరంగేట్రం చేయడానికి 14 సంవత్సరాలు పట్టింది. 1998లో సోనియాగాంధీ, తన 51 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
2004లో రాహుల్ గాంధీ అమేధి నుంచి పోటీ చేయడం ద్వారా తన 34 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి రాగా, ఆపై ఐదేళ్లకు తన 29 ఏళ్ల వయసులో వరుణ్ గాంధీ 2009లో ఫిలిబిత్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆపై పదేళ్లకు... అంటే 2019లో ప్రియాంకా గాంధీ, తన 47 ఏళ్ల వయసులో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా నియమితులై, కాంగ్రెస్ తొలి కుటుంబం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన 11వ వ్యక్తిగా నిలిచారు.