Elections: రూ. 24 వేల రుణమాఫీ అంటూ... రూ. 13 ఇచ్చిన మధ్యప్రదేశ్ సర్కారు!
- ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్
- అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అమలులో అవకతవకలు
- సరిచేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి
శివలాల్ కటారియా... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బడుగు రైతు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రైతు రుణాన్ని మాఫీ చేస్తామంటే నమ్మాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు రుణాల మాఫీ జాబితాలో తన పేరును చూసుకుని మురిసిపోయాడు. తన అప్పులు తీరిపోతాయని భావించాడు. కానీ, అధికారులు తన పేరిట వేసిన డబ్బు చూసి అవాక్కయ్యాడు. రూ. 24 వేలు రుణమాఫీ జరగాల్సివుండగా, ఆయన పేరిట రూ. 13 వచ్చింది.
"రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానంది. బ్యాంకులో నా పేరిట రూ. 23,815 రుణం ఉంది. మొత్తం మాఫీ అవుతుందని భావించాను. కానీ, పంచాయతీ కార్యాలయానికి వచ్చిన జాబితాలో రూ. 13 మాత్రమే ఉంది" అని శివలాల్ వాపోయాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ వార్త విని తాను ఎంతో ఆనందించానని, కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తే, ప్రభుత్వం ఇలా చేస్తుందని అనుకోలేదని అన్నారు.
తాను నిజాయితీగల రైతునని, రుణాలను సకాలంలో చెల్లిస్తూ వచ్చానని, అందువల్లే మిగతా రైతుల్లా కాకుండా తన పేరిట తక్కువ మొత్తం రుణం ఉందని అన్నాడు. రుణమాఫీ పథకంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, రుణమాఫీ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, కొన్ని చోట్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేస్తున్నామని రాష్ట్ర మంత్రి ఓంకార్ సింగ్ మర్కామ్ తెలిపారు.