Kadapa District: మేడాను చేర్చుకున్న అనంతరం వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పి!
- తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
- నేడు జగన్ తో సమావేశం కానున్న రాజంపేట వైకాపా నేతలు
- ఆపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఆకేపాటి
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తరువాత, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటివరకూ రాజంపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉంటూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా టికెట్ తనదేనన్న ధీమాతో ఉన్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, మేడా చేరికతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మేడా మల్లికార్జున్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆయనకే వైసీపీ సీటు లభిస్తుందన్న ప్రచారం జరుగుతూ ఉండటంతో, రెండుసార్లు తన అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. మేడాకు టికెట్ లభిస్తే, పార్టీని, జగన్ ను నమ్ముకుని ఉన్న తన పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డ ఆయన, ఈ విషయంలో తాడో, పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటకు చెందిన వైసీపీ నేతలు నేడు జగన్ ను కలిసి తమలో నెలకొన్న అసంతృప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగన్ తో మాట్లాడిన తరువాత ఆకేపాటి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
నిన్నటివరకూ నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న మేడా, ఆకేపాటి వర్గీయులు, ఇప్పుడు కలిసి పని చేయాలంటే చాలా కష్టమన్నది వీరి వాదన. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఏకైక స్థానం రాజంపేట మాత్రమే. అక్కడ గెలిచిన మేడా టీడీపీ నుంచి వైసీపీకి రావడంతో వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తుండగా, ఈ కొత్తగా వస్తున్న సమస్యల నుంచి జగన్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.