Karnataka: ఎస్‌ఐ అవతారం... అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్‌లో మోసం!

  • తొలుత ప్రేమ పేరుతో అబ్బాయిలకు వల
  • కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు అంటూ వారితోనే బేరసారాలు
  • ఒకరి నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా బయటపడిన వేషం

అడ్డదారిలో డబ్బు సంపాదనకు పలు రకాల మోసాలు చేయడం వింటుంటాం. కానీ ఇతగాడు ఏకంగా అన్ని మోసాలకు అవసరమైన పాత్రలు తానే పోషించి  డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిగా... ఫోన్ లో వాయిస్ ఛేంజర్ తో ప్రేమికురాలిగా, బయట ఎస్‌ఐగా నటిస్తూ తన మోసాలకు తెరతీశాడు. ఓ సందర్భంలో వ్యవహారం బెడిసి కొట్టడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.

 పోలీసుల కథనం మేరకు...నిందితుడు సిద్దప్పది కర్ణాటక రాష్ట్రం హుబ్లీ నగరం. ఇతను ఫేస్‌బుక్‌లో ‘భవిక’ పేరుతో ఓ అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. అమ్మాయినని చెప్పి యువకులతో చాటింగ్‌ చేసేవాడు. యువకుల మొబైల్‌ నంబర్లు తీసుకుని వాయిస్‌ చేంజర్‌ సాఫ్ట్‌వేర్‌తో అమ్మాయిలా మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు సేకరించి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దించేవాడు. ఇలా కొద్దిరోజులు గడిచిన తర్వాత పోలీసు అవతారం ఎత్తేవాడు. తాను ఎవరితోనైతే ఫోన్లో మాట్లాడేవాడో వారిళ్లకు వెళ్లేవాడు. ప్రేమ పేరుతో మోసం చేశారని భవిక అనే అమ్మాయి ఫిర్యాదు చేసిందని, విచారణకు వచ్చినట్టు చెప్పేవాడు. కేసు పేరుతో పలురకాలుగా బెదిరించి అవతలి వారు ఆందోళనకు గురవుతున్నారని గుర్తించిన వెంటనే బేరం పెట్టేవాడు. ఇంత మొత్తం ఇస్తే ఈకేసు నుంచి తప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి డబ్బులు గుంజేవాడు.

ఇలా మైసూరుతోపాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో యువకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే మైసూరులోని శక్తినగర్‌కు చెందిన ఓ ఇంటి వద్ద ఇతని పాచిక బెడిసికొట్టింది. శక్తినగర్‌కు చెందిన శారదమ్మ అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న నిందితుడు మాటల్లో ఆమె కుమారుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు.

రెండు రోజుల క్రితం ఎస్‌ఐ వేషంలో శారదమ్మ ఇంటికి వచ్చిన సిద్దప్ప బెంగళూరులో మీ అబ్బాయి ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేసినట్టు మాకు ఫిర్యాదులు అందాయని, అందుకు సంబంధించి విచారణకు వచ్చినట్టు నమ్మబలికాడు. దీంతో శారదమ్మ, ఆమె భర్త నారాయణగౌడ్‌ కంగారుపడ్డారు. కొడుకు ఏదో తప్పుచేశాడని అనుకుని సిద్దప్పను ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా ఈ కేసు నుంచి తప్పించాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంతమొత్తం లేదని, రూ.5 వేలున్నాయని శారదమ్మ చేతిలో పెట్టింది. కానీ మొత్తం ఇవ్వాలని సిద్దప్ప డిమాండ్‌ చేయడంతో తెచ్చిస్తానంటూ శారదమ్మ భర్త నారాయణగౌడ్‌ బయటకు వెళ్లాడు.

మొదటి నుంచి సిద్దప్ప ప్రవర్తన మీద అనుమానం ఉన్న అతను ఉదయ్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్‌ఐ జైకీర్తి హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రశ్నించగా తాను ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐని అంటూ తొలుత సిద్దప్ప బుకాయించాడు. గుర్తింపు కార్డు, ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధించి పలు విషయాలు ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోవడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో సిద్దప్ప వ్యవహారం బయటపడడంతో కటకటాల్లోకి నెట్టారు.

  • Loading...

More Telugu News