kumaraswamy: ప్రధాని అభ్యర్థిగా మా మద్దతు రాహుల్ గాంధీకే: కుమారస్వామి
- ప్రధాని అర్హత గల నేతలు ప్రాంతీయ పార్టీలలో ఉన్నారు
- తమ మద్దతు మాత్రం రాహుల్ గాంధీకే
- మోదీని ఎదుర్కోగల సత్తా రాహుల్ కు ఉంది
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేదే తమ ఆకాంక్ష అని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. అందుకోసం తమ పార్టీ జేడీఎస్ పని చేస్తుందని చెప్పారు. ప్రధాని పదవికి మమతా బెనర్జీ కూడా అర్హురాలేనని ఇటీవల కుమారస్వామి చెప్పారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారస్వామి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీకి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని కుమారస్వామి తెలిపారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ అభిప్రాయం కూడా ఇదేనని చెప్పారు. ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న నేతలు ప్రాంతీయ పార్టీలలో ఉన్నారని తెలిపారు. మాయావతి, మమత వంటి వారికి అర్హత ఉందని... కానీ, తాము మాత్రం రాహుల్ కే మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రధాని మోదీని ఎదుర్కోగల సత్తా రాహుల్ కు ఉందని అన్నారు. పేపర్ పై ఉన్న పులి బొమ్మ వంటివారు మోదీ అని... ఒక రాజకీయ నేతగా రాహుల్ ఎంతో పరిణతి సాధించారని చెప్పారు.
మోదీ అద్భుతంగా మాట్లాడతారని, సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటారని... నాలుగేళ్ల పాలనతో ఆయన సాధించింది ఇది మాత్రమేనని కుమారస్వామి ఎద్దేవా చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నానని ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.