cuddapha: తేలని జమ్మలమడుగు టికెట్ పంచాయతీ.. ఎమ్మెల్యేగా పోటీకే ఇద్దరు నేతల పట్టు!
- చంద్రబాబు ముందే ఇదే మాటచెప్పిన ఆది, రామసుబ్బారెడ్డి
- ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి ఎంపీగా ప్రతిపాదించిన సీఎం
- అంగీకరించని ఇద్దరు నేతలు
కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ నేతల మధ్య టికెట్ పంచాయతీ కొలిక్కి రాలేదు. టికెట్ కోసం పట్టుబడుతున్న సిటింగ్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు టికెట్టు కోసం పట్టు సడలించడం లేదు. దీంతో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట నేడు జరిగిన సంప్రదింపుల్లోనూ ఏ విషయం తేలలేదు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు.
ఈ సమావేశంలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు రాజీఫార్ములా సూచించారు. జమ్మలమడుగు టికెట్ వదులుకుంటే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తానని, ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ మేరకు రాజీ పడడానికి ఇద్దరు నేతలు అంగీకరించలేదని తెలిసింది. స్థానికంగా తమ మద్దతుదారుల నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న ఒత్తిడి ఉందని, ఈ పరిస్థితుల్లో టికెట్టు వదుకోలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంత నచ్చచెప్పినా ఇద్దరు నేతలు పట్టువిడవకపోవడంతో పంచాయతీ ఎక్కడిదక్కడే ఆగిపోయింది.
కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినందున తమ నాయకునికే టికెట్టు కేటాయించాలని, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని ఆది వర్గీయులు వాదిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని రామసుబ్బారెడ్డి వర్గీయులు కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆయా నాయకులు చెప్పుకుంటున్నారు.