manikarnika: 'మణికర్ణిక'ను ఆపలేం: బాంబే హైకోర్టు
- ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న 'మణికర్ణిక'
- ఝాన్సీ లక్ష్మీబాయిని తప్పుగా చూపించారంటూ కర్ణిసేన పిటిషన్
- ఇప్పుడు సినిమాను ఆపడం కుదరదన్న హైకోర్టు
ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మణికర్ణిక' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను కంగనా రనౌత్ పోషించింది. అంతేకాదు, దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలో క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో... దర్శకురాలిగా కూడా ఆమె మెగా ఫోన్ పట్టుకుంది. మరోవైపు, ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించింది. సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైన నేపథ్యంలో... ఇప్పుడు సినిమా రిలీజ్ ను ఆపలేమని తీర్పును వెలువరించింది. దీనికితోడు, కర్ణిసేన చేసిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ దర్శకనిర్మాతలను ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 'మణికర్ణిక' రేపు విడుదల కాబోతోంది.