Andhra Pradesh: వైఎస్ఆర్ సీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయన్న తాజా సర్వేపై ... చంద్రబాబు స్పందన!
- సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఓ ఉదాహరణ
- ప్రతికూల నాయకత్వానికి జగన్ రుజువు
- ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు సాధారణమే
- ప్రజల మనసును మార్చలేరన్న చంద్రబాబునాయుడు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయని ఓ సంస్థ నిర్వహించిన సర్వే అంచనా వేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సానుకూల నాయకత్వానికి తెలుగుదేశం ఓ ఉదాహరణ అయితే ప్రతికూల నాయకత్వానికి జగన్ రుజువని అన్నారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జరిపించడం జగన్ కు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఇటువంటి దొంగ సర్వేలతో ప్రజల మనసును మార్చలేరని, 2014 ఎన్నికల సమయంలోనూ ఇటువంటి సర్వేలనే చేయించారని, కానీ తెలుగుదేశం పార్టీనే ప్రజలు ఎంచుకున్నారని గుర్తు చేశారు. జగన్ లోని అహంభావాన్ని భరించలేకనే పలువురు నేతలు వైకాపాకు దూరం అవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 1.16 లక్షల నిధులు రావాల్సి వుందని, ఈ విషయంలో నిధులను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖను రాశానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై మోదీని జగన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. విభజన తరువాత అన్యాయం జరిగిన ఏపీకి న్యాయం చేయాల్సిందేనని దేశమంతా కోరుతుంటే, ఒక్క వైసీపీ మాత్రం ఆపని చేయడం లేదని, ప్రజలే వారికి బుద్ధిచెబుతారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు తెలుగుదేశం పార్టీ ప్రాణం పోసిందని, ఇప్పటికే ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10 వేలు ఇచ్చిన సర్కార్, మరో రూ.10 వేలు ఇవ్వనుందని అన్నారు.