Andhra Pradesh: ఏపీ పోలీసులు, వ్యవస్థపై నమ్మకం లేదని జగన్ ఇందుకే చెప్పారు!: బొత్స సత్యనారాయణ
- వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపణ
- బెంగళూరు సంస్థతో సర్వే చేయిస్తున్నారు
- ఈసీని కలుసుకునేందుకు బయలుదేరిన బొత్స
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ అనాలసిస్ అనే సంస్థతో సర్వే చేయిస్తున్నారని విమర్శించారు. ఈ మొత్తం తతంగాన్ని ఓ టీడీపీ నేత నడిపిస్తున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్నందుకే తమ పార్టీ నేత మజ్జి శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.
ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. భక్షకులుగా తయారయ్యారని విమర్శించారు. ఇది కేవలం విజయనగరం జిల్లాలోనే కాకుండా ఏపీ అంతటా జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని కలుసుకోవడానికి వెళుతున్నట్లు ప్రకటించారు.
ఈ ఓట్ల తొలగింపు విషయమై ఈసీకి ఫిర్యాదు చేస్తామనీ, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని తెలిపారు. కాగా, మీడియాతో మాట్లాడిన అనంతరం బొత్స, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్ ను కలుసుకునేందుకు బయలుదేరారు.