vijay sethupathi: మార్పులు చేర్పులతో తెలుగు '96'
- తమిళంలో హిట్ కొట్టిన '96'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- స్క్రిప్ట్ పై జరుగుతోన్న కసరత్తు
ఒక భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సహజం. ఆల్రెడీ హిట్ అయింది కదా అని మరో భాషలో తీసేటప్పుడు ఆ కంటెంట్ ను అలాగే ఉంచడం సాధారణంగా జరగదు. ఆయా ప్రాంతాలకి సంబంధించిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కథలో మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. అలా ఇప్పుడు '96' తెలుగు రీమేక్ కి సంబంధించిన కథలో మార్పులు .. చేర్పులు జరుగుతున్నాయి.
క్రితం ఏడాది తమిళంలో భారీ విజయాలను అందుకున్న చిత్రాలలో '96' ఒకటి. వసూళ్ల విషయం పక్కన పెడితే .. వైవిధ్యభరితమైన చిత్రంగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న దిల్ రాజు, శర్వానంద్ - సమంతలను ఎంపిక చేసుకున్నారు. తమిళంలో '96'ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ కే ఆయన తెలుగు సినిమా దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు.
తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట. తమిళ '96'లో స్కూల్ డేస్ కి సంబంధించిన ఎపిసోడ్స్ పై తెలుగులో పెద్దగా ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. కాలేజ్ రోజుల్లోని లవ్ స్టోరీనే హైలైట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చిలో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేసి, ఆగస్టులో థియేటర్లకు తీసుకురానున్నట్టుగా సమాచారం.