Priyanandan: మలయాళ సినీ దర్శకుడు ప్రియానందన్‌పై ఆవుపేడతో దాడి.. ముఖ్యమంత్రి ఖండన
- పాల కోసం వెళ్లిన ప్రియానందర్
- బీజేపీ నాయకులే దాడి చేశారని ఆరోపణ
- దాడులను సహించేది లేదన్న సీఎం
ఇటీవల జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకుడు ప్రియానందన్ శబరిమల గురించి ఫేస్బుక్ ఖాతాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వ్యాఖ్యలు హిందూత్వాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ కొందరు ఆ పోస్టులను తొలగించేలా చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనపై కొందరు దాడి చేశారు. త్రిశూర్ పోలీసుల కథనం ప్రకారం.. నేటి ఉదయం ఆయన పాలు తీసుకెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై ఆవు పేడతో దాడి చేశారు.
ఈ విషయమై ప్రియానందన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులే ఈ పని చేయించారని ఆరోపించారు. దాడి అనంతరం స్థానికులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ప్రియానందన్ త్రిశూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ దాడి గురించి తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రనగా ఖండించారు. ప్రియానందన్‌పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి వ్యక్తికి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందని.. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు.