KA Paul: ఆ రూ. 2 లక్షల కోట్లను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారు?: కేఏ పాల్
- ఏపీ ఆదాయం రూ. 1.5 లక్షల కోట్లు
- బడ్జెట్ మాత్రం రూ.3.5 లక్షల కోట్లు
- రాష్ట్రం కోసం రూ. 5 లక్షల కోట్లు తీసుకొస్తా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి, బడ్జెట్‌కు పొంతనే లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. విశాఖపట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ప్రస్తుత ఆదాయం కేవలం రూ. 1.5 లక్షల కోట్లని, బడ్జెట్ మాత్రం రూ.3.5 లక్షల కోట్లని పేర్కొన్న పాల్.. మిగతా రెండు లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అవినీతి రహిత సమాజ స్థాపనే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రం కోసం రూ.5 లక్షల కోట్లు తెచ్చే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. తమతో కలిసి రావాలంటూ జనసేన పార్టీని పాల్ ఆహ్వానించారు. తమతో పొత్తు పెట్టుకోకుంటే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని పాల్ జోస్యం చెప్పారు.