India: భారీ స్కోరు దిశగా భారత్.. రాణించిన ఓపెనర్లు
- న్యూజిలాండ్‌తో రెండో వన్డే
- తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యం
- రెండు వికెట్లు కోల్పోయిన భారత్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు తొలి బంతి నుంచే బ్యాట్‌కు పనిచెప్పారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్డేల్లో 27వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధవన్.. బౌల్ట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొత్తం 67 బంతులు ఎదుర్కొన్న ధవన్ 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు.
ధవన్ అవుటైనా జోరు తగ్గించని రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో లాకీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 96 బంతులు ఆడిన రోహిత్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 38వ అర్ధ సెంచరీ. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 22, అంబటి రాయుడు 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.