sirivennela: వెండితెరపై కురిసిన సిరివెన్నెలకు 'పద్మశ్రీ'!

  • పాటల రచయితగా ప్రత్యేక స్థానం
  • అద్భుతమైన భావ ఆవిష్కరణ
  •  చైతన్య స్ఫూర్తిని రగిల్చే గీతాలు  
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. నలుగురికి 'పద్మ విభూషణ్' .. 14 మందికి 'పద్మ భూషణ్' .. 94 మందికి 'పద్మశ్రీ' పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ఆర్ట్స్ - లిరిక్స్ విభాగంలో పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి 'పద్మశ్రీ' అవార్డు దక్కింది.

'విధాత తలపున ప్రభవించినది..' అంటూ తన సాహితీ సేద్యాన్ని ప్రారంభించి.. 'ఈ గాలి .. ఈ నేల .. ఈ ఊరు' అంటూ ప్రకృతిలోని పరిమళాలను అక్షరాలకు అద్ది .. మనసు గోడలకు మధురానుభూతులను మెత్తిన గొప్ప గేయ రచయిత ఆయన. 'తెల్లారింది లెగండో .. కొక్కొరొక్కో .. ' అంటూ 'కళ్లు' సినిమా కథలోని సారాంశాన్ని ఒక్క పాటలో ఆవిష్కరించిన ఘనత ఆయనది.

 'జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది .. ' అంటూ జీవిత సత్యాన్ని .. తత్త్వాన్ని చాటిన గొప్పతనం ఆయన సొంతం. 'ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ .. ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ .. 'అంటూ మహాత్ముడికి మనమిచ్చే అసలైన నీరాజనమేమిటనే ఆలోచన రేకెత్తించిన భావశాలి ఆయన. ఇలా ఎన్నో సందేశాత్మక గీతాలతో .. చైతన్య స్ఫూర్తిని రగిల్చిన సిరివెన్నెలకి 'పద్మశ్రీ' దక్కడం .. తెలుగు సినీ సాహిత్యానికి మరోమారు దక్కిన గౌరవమే అని చెప్పాలి.
sirivennela

More Telugu News