Andhra Pradesh: వైసీపీలోకి సినీ నటి జయప్రద.. రాజమండ్రి లోక్ సభ సీటుపై కన్ను!
- సీనియర్ నేతలతో టచ్ లో ఉన్న నటి
- లోక్ సభ కుదరకుంటే రాజ్యసభ సీటుకు ఓకే
- ఇంకా స్పందించని వైసీపీ అధిష్ఠానం
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే ఏపీ నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నారా? అంటే సన్నిహిత వర్గాలు అవుననే చెబుతున్నాయి. జయప్రద వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనీ, ఇందుకోసం వైసీపీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయప్రద, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ తరఫున మరోసారి ఎంపీ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీలో ఆమె అమర్ సింగ్ మనిషిగా గుర్తింపు పొందారు. అయితే పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ మధ్య విభేదాలు రావడంతో జయప్రద సమాజ్ వాదీ పార్టీని వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి జయప్రద ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా సొంత రాష్ట్రంపై దృష్టి సారించిన జయప్రద జనసేనలో చేరతారని తొలుత వార్తలు వచ్చాయి.
అయితే సంస్థాగతంగా బలంగా లేని జనసేన కంటే వైసీపీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజమండ్రి లోక్ సభ స్థానం ఇవ్వాలనీ, లేదంటే రాజ్యసభకు పంపించాలని జయప్రద కోరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ నిర్ణయం ఏంటో ఇంకా వెల్లడి కాలేదు.