India: రెండో వన్డే: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన భారత్
- నిర్ణీత 50 ఓవర్లలో 325 పరుగులు చేసిన భారత్
- 234 పరుగులకే ఆలౌట్ అయిన కివీస్
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్ శర్మ
మౌంట్ మాంగనుయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 90 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. భారత్ విసిరిన 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. 40.2 ఓవర్లలోనే 234 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటి, 4 వికెట్లతో కివీస్ వెన్ను విరిచాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్ 22 పరుగులు చేశారు. బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్లలో ఎవరూ విఫలం కాలేదు. ధోనీ, జాధవ్ లు నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్ లు చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్... క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. బ్రేస్ వెల్ మాత్రమే 57 పరుగులు చేసి భారత బౌలింగును కొంత వరకు ఎదుర్కోగలిగాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో గుప్టిల్ 15, మన్రో 31, విలియంసన్ 20, టేలర్ 22, లాథమ్ 34, నికోల్స్ 28, గ్రాండ్ హోమ్ 3, సోథి డకౌట్, ఫెర్గ్యూసన్ 12, బౌల్ట్ 10 (నాటౌట్) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువనేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి, భారత్ విజయంలో కీలకపాత్రను పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. జనవరి 28న భారత్-న్యూజిలాండ్ ల మధ్య మూడో వన్డే (డేనైట్) జరగనుంది.