Telangana: ఫిబ్రవరి 10లోపు మంత్రివర్గ విస్తరణ.. హరీశ్, కేటీఆర్ లకు బెర్త్ లేనట్టేనా?
- ప్రస్తుతానికి 8 మందితోనే సరి
- లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో విస్తరణ
- వచ్చే నెల 5 నుంచి మాఘమాసం.. విస్తరణకు ముహూర్తం
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 40 రోజులు గడుస్తున్నా మంత్రి వర్గాన్ని విస్తరించకపోవడంపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. వచ్చే నెల 5 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండడంతో ఆ రోజు నుంచి పదో తేదీ లోపు మంచి ముహూర్తాన్ని చూసి మంత్రి వర్గాన్ని విస్తరించాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పదో తేదీన వసంత పంచమి కావడంతో అదే రోజున విస్తరించాలన్న యోచన కూడా ఉన్నట్టు సమాచారం.
మొత్తం 18 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి 8 మందితోనే మంత్రి వర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కొందరిని లోక్‌సభ ఎన్నికల్లో దింపనున్నారని, అందుకనే ఆ తర్వాత పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించాలన్నది కేసీఆర్ యోచన అని చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని యోచిస్తున్న కేసీఆర్ మంత్రి వర్గంలో కుమారుడు కేటీఆర్‌కు ప్రస్తుతానికి చోటు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాతి పరిస్థితులను బట్టి ఆ తర్వాత నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్‌ను పార్టీకే పరిమితం చేయాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, హరీశ్ రావుకు మంత్రి పదవిపైనా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. అయితే, హరీశ్‌ను కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలన్న యోచనతోనే ఆయనను కేబినెట్లోకి తీసుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.