Telangana: అంబేద్కర్ కు భారతరత్న అవార్డు బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది!: అసదుద్దీన్ ఒవైసీ
- అవార్డును హృదయపూర్వకంగా ఇవ్వలేదు
- దళిత, మైనారిటీ, బ్రాహ్మణులకు ఇచ్చారా?
- మహారాష్ట్రలోని కల్యాణ్ సభలో మజ్లిస్ అధినేత
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కు 1990లో భారత రత్న ప్రకటించడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కు హృదయపూర్వకంగా ఈ అవార్డును ఇవ్వలేదనీ, బలవంతంగా ఇవ్వాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కల్యాణ్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సాం గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్ ముఖ్ లకు ఈసారి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.