Vijayawada: నాలుగున్నరేళ్లు ఏం చేశావు బాబు...ఇప్పుడు బీసీల జపం చేస్తున్నావు?: ధర్మాన ప్రసాదరావు
- మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం అని విమర్శ
- ఇన్నేళ్లలో ఒక్క బీసీనీ రాజ్యసభ సభ్యుడిని చేయలేదేం?
- జయహో బీసీ అనే నైతికత బాబుకు లేదు
‘జయహో బీసీ’ అనే నైతిక అర్హత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదని, అధికారంలో ఉండగా బీసీలకు కించిత్తు ఉపకారం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాజమండ్రి బీసీ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ నాలుగున్నరేళ్ల కాలంలో బీసీలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని కోరారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలను మోసం చేసేందుకు మాయమాటలతో చంద్రబాబు అల్లుకుపోతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు బాబు ఏ వర్గాల వారికి మంత్రి పదవులు కట్టబెట్టారో అందరికీ తెలుసన్నారు. అంతెందుకు... ఇన్నాళ్ల మీ రాజకీయ జీవితంలో ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు.
బీసీలకు జరిగిన అన్యాయంపై జస్టిస్ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారని నిలదీశారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ గెలిస్తే ఎస్టీల్లో చేరుస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చి, తర్వాత గెలిచాక హామీ నిబెట్టుకోవాలని మత్స్యకారులు నిరసన తెలియజేస్తే అంతుచూస్తానని వారిని బెదిరించిన విషయాన్ని బాబు మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదన్నారు.
ఇన్నాళ్లు బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఎన్నికల వేళ బీసీలు ప్రశ్నిస్తారనే ఇటువంటి సభలు పెడుతున్నారని, నిజంగా బీసీలకు న్యాయం చేసి ఉన్నట్టయితే ఇటువంటి సమావేశాలు అవసరం లేదని అన్నారు.