ambati rayudi: అంబటి రాయుడి బౌలింగ్ పై నిషేధం విధించిన ఐసీసీ
- ఈనెల 13న ఆసీస్ తో జరిగిన వన్డేలో బౌలింగ్ చేసిన రాయుడు
- బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీకి ఫిర్యాదులు
- బౌలింగ్ యాక్షన్ పరీక్షకు హాజరుకాకపోవడంతో.. నిషేధం
అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటుతున్న తెలుగుతేజం అంబటి రాయుడి బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ తప్పుబట్టింది. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా అతనిపై నిషేధం విధించింది. ఈ నెల 13న సిడ్నీలో అస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడు బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాయుడి బౌలింగ్ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఐసీసీకి ఫిర్యాదు అందింది.
దీంతో, బౌలింగ్ యాక్షన్ కు సంబంధించి పరీక్షకు హాజరుకావాలంటూ రాయుడిని ఐసీసీ ఆదేశించింది. 14 రోజుల్లోగా పరీక్షకు హాజరుకావాలని సూచించింది. అయితే, గడువు ముగిసినా పరీక్షకు రాయుడు హాజరు కాలేదు. దీంతో, నిబంధనల్లోని 4.2 క్లాజ్ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధం విధించింది. పరీక్షులకు వచ్చి, బౌలింగ్ యాక్షన్ సక్రమంగా ఉందని నిరూపించుకునే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.