election commission: రాష్ట్రాలకు కీలక ఆదేశాలను జారీ చేసిన ఎన్నికల కమిషన్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ
- అధికారులకు సొంత జిల్లాల్లో నియామకాలు ఇవ్వొద్దు
- మూడేళ్లు ఒకే జిల్లాలో పని చేసిన వారికి అదే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరాదు
త్వరలో లోక్ సభ ఎన్నికలతో పాటు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల సంఘం లేఖలు రాసింది. పోలింగ్ విధులను నిర్వర్తించే అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారులకు సొంత జిల్లాల్లో నియామకాలను ఇవ్వద్దని ఆదేశించింది.
2019 మార్చి 31 వరకు ఒకే జిల్లాలో పదవీకాలం పూర్తి చేసుకునే అధికారులకు అదే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వరాదని ఈసీ సూచించింది. గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లు ఒకే జిల్లాలో పని చేసిన ఉద్యోగులకు అదే జిల్లాలో విధులను అప్పగించవద్దని ఆదేశించింది. 2017 మే 31కి ముందు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన జిల్లాల్లో... డీఈవో, ఎస్సై, ఆర్వో, వీఆర్వోలకు తిరిగి పోస్టింగ్ లు ఇవ్వరాదని ఆదేశించింది.