siddaramaiah: మహిళ పట్ల సిద్ధరామయ్య అనుచిత ప్రవర్తన.. కన్నెర్రజేసిన జాతీయ మహిళా కమిషన్
- మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఘటన
- మహిళ చేతిలోని మైకును లాక్కున్న సిద్ధరామయ్య
- ఆమె చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చిన వైనం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిన ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులను కోరింది. పెద్దపెద్ద పదవులను అనుభవించిన వారు మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది.
వివాదం వివరాల్లోకి వెళ్తే, మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ పట్ల సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమీలా అనే ఓ గ్రామ నాయకురాలు (కాంగ్రెస్ కార్యకర్త) మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్యను నిలదీశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తమకు అందుబాటులో ఉండటం లేదని ఆమె ఆరోపించారు.
దీంతో, ఆగ్రహానికి గురైన సిద్ధరామయ్య... ఆమె చేతిలోని మైకును లాక్కున్నారు. అయితే, ఈ ప్రయత్నంలో పొరపాటున ఆమె ధరించిన చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె వాదిస్తూ ఉండటంతో... గద్దించి, ఆమెను సిద్ధరామయ్య కూర్చోబెట్టారు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదం అయింది.