Tamilnadu: స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలంటూ... శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో రుద్రపూజలు!
- దిండుగల్ జిల్లాలో పూజలు
- ప్రజలను ఆహ్వానిస్తూ కరపత్రాలు
- రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
దాదాపు పదేళ్ల క్రితం తమిళనాడులో అధికారానికి దూరమైన డీఎంకే, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సులతో తమ నేత స్టాలిన్ సీఎం కావాలంటూ రుద్రపూజలు జరిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాస్తికత్వాన్ని ప్రోత్సహించే డీఎంకే, దేవతలకు మొర పెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దిండుగల్ జిల్లా పళనిలో కొలువైన సుబ్రమణ్యస్వామి క్షేత్ర సమీపంలో ఉన్న ఆండినాయకన్ వలసు గ్రామంలో ఈ పూజలు జరిగాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానికులు, డీఎంకే మిత్రపక్షాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్ చక్రపాణి ఈ 'రుద్రపూజ'లకు ఆహ్వానం పలుకుతూ ముద్రించిన కరపత్రాలు కూడా బయటకు వచ్చాయి. దీనిలో స్టాలిన్, రవిశంకర్ తదితరుల ఫోటోలు ఉన్నాయి.
ఈ పూజలు శనివారం నాడు జరిగినట్టు తెలుస్తుండగా, ఆపై పూజల విషయంలో దుమారం చెలరేగింది. తమ పార్టీ తరఫున ఎలాంటి పూజలూ జరిపించలేదని డీఎంకే చెబుతుండగా, పూజల్లో తాము పాల్గొన్నామని ఆండినాయకన్ వలసు గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తాను సీఎం అయ్యేందుకు పన్నీర్ సెల్వం యాగాలు చేయించారని స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు స్టాలిన్ సీఎం కావాలంటూ పూజలు జరగడం, ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో ఇవి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.