Chandrababu: ప్రత్యేక హోదాపై నేడు ఉండవల్లి అఖిలపక్షం.. వైసీపీ దూరం!
- వైసీపీ తప్ప అన్ని పార్టీలు హాజరవుతున్నాయన్న ఉండవల్లి
- టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్‌బాబు
- బుధవారం చంద్రబాబు నేతృత్వంలో అఖిలపక్షం
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో నేడు విజయవాడలో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి దాదాపు రాజకీయ పార్టీలన్నీ హాజరవుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉంది. అఖిలపక్షానికి హాజరు కావాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ తరపున మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపుతున్నారు.
టీడీపీతో కలిసి ఒకే వేదికను పంచుకోలేమని పేర్కొన్న వైసీపీ ఈ సమావేశానికి తాము హాజరు కాబోవడం లేదని తేల్చి చెప్పింది. ఈ సమావేశానికి వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ హాజరువుతున్నాయని ఉండవల్లి ప్రకటించారు. మరోవైపు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై చర్చించనున్నారు.