Amaravati: అమరావతిలో జగన్ నూతన గృహ ప్రవేశానికి ముహూర్తం ఖరారు
- ఫిబ్రవరి 14, ఉదయం 8.21
- గృహ ప్రవేశం చేయనున్న వైఎస్ జగన్
- ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం కూడా
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అమరావతి నుంచే పార్టీని నడిపించాలని, ఇక్కడి నుంచే పర్యటనలు, ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 8.21 గంటలకు ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు.
తాడేపల్లిలో ఆయన తన ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సమరభేరి మోగించేందుకు సిద్ధమైన జగన్, ఇక రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని, హైదరాబాద్ లోనే నివాసం ఉంటే ప్రయాణాలకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుందన్న ఆలోచనతో, అమరావతి నుంచే రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నారు.
కాగా, జగన్ నివాసానికి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. దాని నిర్మాణం కూడా పూర్తయింది. ఇక త్వరలోనే వైసీపీ పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గృహ ప్రవేశం ఇంటి సభ్యులు, కొందరు ముఖ్య అతిథుల మధ్య జరుగుతుందని, అదే రోజున జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని తెలుస్తోంది.