Undavalli: ఉండవల్లి అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్!
- రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చిస్తున్న అఖిలపక్షం
- వైసీపీ మినహా మిగతా పార్టీల ప్రతినిధులు హాజరు
- జనసేన తరఫున స్వయంగా వచ్చిన పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి జరిగిన నష్టంపై చర్చించేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలూ తమ ప్రతినిధులను ఈ సమావేశానికి పంపగా, జనసేన తరఫున స్వయంగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కుటుంబరావులు రాగా, కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి రాగా, జస్టిస్ చలమేశ్వర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సమావేశానికి ముందు నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడతాయని, సమావేశానికి హాజరు కావాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని అన్నారు. ఆ పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. విభజన హామీల అమలుపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం గురించి ఈ సమావేశంలో తెలియజేస్తామని పేర్కొన్నారు. విభజన తరువాత ఏపీకి పూర్తిగా అన్యాయమే జరిగిందని ఆయన అన్నారు.