Chandrababu: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితమిస్తా: చంద్రబాబు
- నీటి సమస్య లేకుండా చేస్తాం
- రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా
- హంద్రీనీవాకు రూ.12 కోట్లు ఖర్చు చేశాం
- పోలవరం పనులు 64 శాతం పూర్తి
సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణా, వంశధార, నాగవళి, పెన్నా నదులను అనుసంధానం చేస్తానని.. తద్వారా రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం చెర్లోపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలను విడుదల చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట అని, రాష్ట్రంలోనే దానిని నంబర్ వన్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం నీరు - ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తున్నామని.. దీని వల్ల అనంతపురం జిల్లా లాభపడిందన్నారు. హంద్రీనీవాకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని.. పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీరు విడుదల చేశామన్నారు. పోలవరం పనులు ఇప్పటికే దాదాపు 64 శాతం పూర్తయ్యాయని.. మే నెలలోగా గేట్లు ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.