Pakistan: పాకిస్థాన్‌లో సివిల్ న్యాయమూర్తిగా హిందూ మహిళ సుమన్‌కుమారి
- సొంత జిల్లా కంబర్ షప్‌దత్‌కోట్‌లో సేవలందించనున్న కుమారి
- దేశంలో ఓ హిందూ మహిళకు జడ్జిగా తొలి అవకాశం
- గతంలో చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన రాణాభగవాన్‌దాస్
పాకిస్థాన్‌లో ఓ హిందూ మహిళ చరిత్ర సృష్టించారు. ముస్లిం దేశమైన ఇక్కడ ఓ హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా నియమితురాలైంది. కంబర్ షప్‌దత్‌కోట్ జిల్లాకు చెందిన సుమన్‌కుమారి ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆమె తన సొంత జిల్లాలోనే న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. పాకిస్థాన్ చరిత్రలో ఇలా ఈ పదవిలో మహిళ నియమితురాలు కావడం ఇదే తొలిసారి. గతంలో హిందువైన రాణాభగవాన్‌దాస్ చీఫ్ జస్టిస్‌గా 2005-07 మధ్య పనిచేసినా మహిళకు అత్యున్నత పదవి లభించడం మాత్రం ఇదే తొలిసారి.
పాకిస్థాన్‌లోని హైదరాబాద్ రాష్ట్రంలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసించిన కుమారి కరాచీలోని జబిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. లతామంగేష్కర్ అభిమాని అయిన సుమన్ కుమారి నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని యోచిస్తున్నారు. ‘నా కుమార్తెకు సవాళ్లతో కూడిన వృత్తిలో కొనసాగడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం దక్కింది. ఆమె కఠోర శ్రమతో నిజాయతీగా సేవలందించగలదని భావిస్తున్నాను’ అని కుమారి తండ్రి పవన్‌కుమార్ బోధన్ అన్నారు.