paruchuri: ఎన్టీఆర్ చెప్పిన మార్గంలోనే నడుస్తున్నాను: పరుచూరి గోపాలకృష్ణ
- ఏ పనినైనా ప్రేమిస్తూ చేయాలి
- అంకితభావంతో చేయాలి
- విసుగును దగ్గరికి రానీయకూడదు
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తనతో చెప్పిన కొన్ని మంచి మాటలను గురించి ప్రస్తావించారు. "మీరు ఎంత గొప్పగా రాస్తారనేది తరువాత .. అనుకున్న సమయానికి రాస్తున్నారా? లేదా? అనేది ముఖ్యం. ముందు మీరు రాసేయాలి .. దర్శకనిర్మాతలు చూసి మార్పులు అడిగినప్పుడు చేయాలి. రాస్తాను .. రాస్తాను అంటూ కూర్చుంటే మీరేం రాస్తారో మాకు తెలియదే"అని ఎన్టీఆర్ అన్నారు.
"చేస్తున్న పనిమీద నిబద్ధత ఉండాలి .. చేస్తోన్న పనిమీద ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఏ పనినైనా ప్రేమిస్తూ చేయాలి .. మనం చేస్తోన్న పనే మనకి అన్నం పెడుతుంది కనుక దానిని దైవంగా భావించాలి. మనం చేస్తోన్న పనిలో లీనమైపోవాలి. కొత్త మార్గంలోకి వెళ్లినా గతంలో చేసిన పనిని మరిచిపోవద్దు" అన్నారు.
అలాగే ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాలు చేయడం మానుకోలేదు. ఆ మాటనే నేను గుర్తుపెట్టుకున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినా అధ్యాపకుడిగా నేను గతంలో చేసిన పనిని మరిచిపోలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యుడిగా వెళ్లి పాఠాలు చెప్పి వస్తున్నాను" అని అన్నారు.