Andhra Pradesh: ఏపీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తుల ఆందోళన!
- గుంటూరు జిల్లా తుమ్మర్ కోటలో దారుణం
- చిన్నారిని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
- నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామన్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రెంటచింతల మండలం తుమ్మర్ కోట గ్రామంలో మిర్యాల జయరాం అనే యువకుడు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై జయరాం కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నొప్పితో ఏడవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాలికను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం గ్రామస్తులు మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత కుటుంబానికి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు.