Andhra Pradesh: ఫిబ్రవరి 17న ఏలూరులో ‘బీసీ గర్జన’ సభ.. డిక్లరేషన్ ప్రకటించనున్న జగన్!
- ఏడాదిన్నర క్రితమే జగన్ అధ్యయన కమిటీ వేశారు
- చంద్రబాబు పాలనలో బీసీల పరిస్థితి దుర్భరం
- మీడియాతో వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, జంగా
బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో జగన్ ఏడాదిన్నర క్రితం బీసీల సమస్యలపై అధ్యయన కమిటీని నియమించారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీలో అన్ని బీసీ కుల సంఘాలతో సమావేశమై ఈ కమిటీ చర్చించిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలు దుర్భరస్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో చంద్రబాబు జయహో బీసీ పేరుతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు బీసీల సంక్షేమంపై చేసే వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో బీసీలు ఎవ్వరూ చంద్రబాబును నమ్మడం లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 17న పశ్చిమగోదావరిలోని ఏలూరులో జరిగే ‘బీసీ గర్జన’ సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీ కులాలన్నీ ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.