team india: ఊరిస్తున్న రికార్డు: 52 ఏళ్లలో సాధించలేనిదాన్ని టీమిండియా రేపు సాధిస్తుందా?
- కివీస్ గడ్డపై 3-1 తేడాతో గెలవడమే ఇప్పటి వరకు టీమిండియా రికార్డు
- రేపు గెలిస్తే 4-0 ఆధిక్యం
- కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్న రోహిత్
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. 5 వన్డేల సిరీస్ ను ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. 1967 నుంచి న్యూజిలాండ్ లో భారత్ పర్యటిస్తోంది. ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అది కూడా 2008-09 పర్యటనలో. రేపు జరగనున్న వన్డేలో గెలిస్తే కివీస్ గడ్డపై 4-0 తేడాతో గెలుపొంది, అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంటుంది. రేపు ఉదయం 7.30 గంటలకు హామిల్టన్ లో నాలుగో వన్డే జరగనుంది. చివరి రెండు వన్డేలకు కోహ్లీ దూరం కావడంతో... అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు.