Guntur District: బహిర్భూమికి వెళ్లిన బాలికపై అత్యాచారం... రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తం!
- ఏడేళ్ల బాలికపై అత్యాచారం
- విషయం తెలిసి పరామర్శించిన పరిటాల సునీత
- ఘాతుకాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దని ఆదేశం
రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లిన బాలికపై కన్నేసిన ఓ కామాంధుడు, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టగా, గుంటూరు జిల్లా రెంటచింతల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులపై గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రహదారిని దిగ్బంధించడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచి పోయాయి.
గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి సమయంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక బహిర్భూమికి వెళుతూ, అదే ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న మిర్యాల జయరావ్ (25) కంట బడింది. బాలికను పట్టుకున్న జయరావ్, ఆమె దవడపై రాయితో కొట్టి పళ్లూడగొట్టాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన బాలికను బంధువులు ఆరా తీయగా విషయం చెప్పింది. ఆ వెంటనే జయరావ్ తనకు సంబంధం లేదని, ఘటనా స్థలివద్ద మరో వ్యక్తి ఉండవచ్చని అంటూ, వారిని తీసుకెళ్లాడు. అక్కడ వారిని మభ్యపెట్టి పారిపోయాడు. బాలికను తొలుత గురజాల ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు.
కాగా, జయరావ్ కు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, భార్యకు దూరంగా ఉంటున్నాడు. నిన్నటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి పరిటాల సునీత, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో కలిసి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఇటువంటి ఘాతుకాలకు పాల్పడే వారిని సహించేది లేదని సునీత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.