cold waves: తెలంగాణలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- సిర్పూర్లో 3 డిగ్రీలు
- రాత్రిపూట పంజా విసురుతున్న చలి
- తెలంగాణ ప్రభావం ఏపీ కోస్తా జిల్లాలపైనా
ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం గజగజలాడుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రాత్రిపూట కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఏపీలోని గుంటూరు జిల్లాపైనా కనిపిస్తోంది. మరోపక్క కోస్తా జిల్లాలను చలి వణికిస్తోంది.
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే కొమరంభీం జిల్లా సిర్పూర్ లోనూ 3 డిగ్రీలు నమోదయ్యింది. హన్మకొండలో 9 డిగ్రీలు నమోదయింది. హైదరాబాద్, రామగుండంల్లోనూ 9 డిగ్రీలు, నిజామాబాద్లో 10 డిగ్రీలు నమోదయింది.
నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు విడిపోకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉత్తర శీతలగాలుల ప్రభావం రాయలసీమపైనా కనిపిస్తోంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.