agusta westland: అగస్టా హెలికాప్టర్ల కేసులో ముందడుగు.. రాజీవ్ సక్సేనాను అరెస్ట్ చేసిన ఈడీ
- సక్సేనాను నిన్న భారత్ కు అప్పగించిన యూఏఈ
- తెల్లవారుజామున సక్సేనాను ఢిల్లీ తీసుకొచ్చిన అధికారులు
- సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంలో కీలక అడుగు పడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న లాబీయిస్ట్ రాజీవ్ సక్సేనాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సక్సేనాను భారత్ కు యూఏఈ నిన్న అప్పగించింది. దీంతో, ఈ తెల్లవారుజామున ఆయనను ఇండియాకు తీసుకొచ్చారు. యూఏఈ కాలమానం ప్రకారం నిన్న ఉదయం 9.30 గంటలకు రాజీవ్ సక్సేనాను అతని నివాసం నుంచి అక్కడి భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయనను భారత అధికారులకు అప్పగించారు. ఈ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో సక్సేనా, మరో లాబీయిస్టు దీపక్ తల్వార్ లను తీసుకుని అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.