india: నాలుగో వన్డేలో చిత్తుగా ఓడిన భారత్
- 93 పరుగులకే ఆలౌటైన భారత్
- 14.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా బౌల్ట్
న్యూజిలాండ్ తో హామిల్టన్ లో జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కివీస్ బౌలర్లు, బ్యాట్స్ మెన్ విరుచుకుపడిన వేళ... భారత్ కు ఘోర పరాభవం తప్పలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 14.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ లో 3-1 తేడాతో కొంత పరువు దక్కించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ను కివీస్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. టీమిండియా బ్యాట్స్ మెన్లలో ఏడుగురు కనీసం రెండంకెల స్కోరును కూడా సాధించలేకపోయారు. చాహల్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభ్ మన్ గిల్ 9, రాయుడు 0, కార్తీక్ 0, జాదవ్ 1, పాండ్యా 16, భువనేశ్వర్ 1, కుల్దీప్ యాదవ్ 15, చాహల్ 18, కేకే అహ్మద్ 5 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 5, గ్రాండ్ హోమ్ 3 వికెట్లు తీయగా... ఆస్లే, నీషమ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే లక్ష్యం చిన్నది కావడంతో అలవోకగా తెలుపొందింది. గుప్టిల్ 14, విలయంసన్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వీరిద్దరినీ భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. నికోల్స్ 30, టేలర్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 21 పరుగులకు 5 వికెట్లు తీసిన బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.