cbi: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామక పిటిషన్ విచారణ: బెంచ్ నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ
- ఒకే రాష్ట్రానికి చెందిన వారమని వివరణ
- ఇంతకుముందే తప్పుకున్న చీఫ్ జస్టిస్ గొగోయ్, జస్టిస్ సిక్రి
- నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచి నుంచి తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.వి.రమణ తప్పుకున్నారు.
తామిద్దరం ఒకే రాష్ట్రానికి చెందిన వారమని, పైగా నాగేశ్వరరావు కుమార్తె వివాహానికి తాను హాజరయ్యానని, వీటిని దృష్టిలో పెట్టుకునే తాను తప్పుకుంటున్నట్లు విచారణ సందర్భంగా రమణ తెలిపారు. ఈ బెంచ్ నుంచి ఇప్పటికే చీఫ్ జస్టిస్ గొగోయ్, జస్టిస్ సిక్రిలు తప్పుకున్న విషయం తెలిసిందే. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నత స్థాయి సెలక్షన్ కమిటీలో తాను ఉన్నానని చెప్పి గొగోయ్ తప్పుకోగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలగించిన కమిటీలో తానున్నందున వైదొలుగుతున్నట్లు జస్టిస్ సిక్రీ అప్పట్లో ప్రకటించారు.