nampally: నుమాయిష్ ఎగ్జిబిషన్ ఘటనలో బాధితులను ఆదుకుంటాం: ఈటల రాజేందర్
- ఈ ప్రమాద ఘటన విచారకరం
- ఎగ్జిబిషన్ సొసైటీ ఆదుకుంటుంది
- బాధితులకు ప్రభుత్వ సాయమందిస్తాం
హైదరాబాద్ లోని నుమాయిష్ ఎగ్జిబిషన్ లో నిన్న అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన తెలిసిందే. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాద సంఘటన జరిగిందంటూ వస్తున్న వదంతులపై ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము అనుకోవడం లేదని, ఓ షాపు వద్ద ఎవరో కాల్చిపడేసిన సిగిరెట్ వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమిక సమాచారంగా తెలిసిందని అన్నారు. ఈ ప్రమాద ఘటన విచారకరమని, బాధితులను ఎగ్జిబిషన్ సొసైటీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా, బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైరింజన్ సిబ్బంది వెంటనే స్పందించారని ఈటల పేర్కొన్నారు. ఫైరింజన్ నీళ్లు లేకపోవడం వల్ల సహాయక చర్యలు ఆలస్యమయ్యాయన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ ప్రమాద ఘటనపై రెండ్రోజుల్లో నివేదిక వస్తుందని, ఆ తర్వాత తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఎగ్జిబిషన్ లోని ప్రతి షాపులో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఈటల వెల్లడించారు. ఎగ్జిబిషన్ లో స్టాళ్లను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఏర్పాటు చేశామని, అయితే, షాపుల లోపల ఫ్లైవుడ్, కర్రలతో ప్రత్యేక ఏర్పాట్లను ఆయా షాపుల యజమానులు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఎగ్జిబిషన్ లోని షాపులకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదని, బాధితులకు సొసైటీ తరపున తక్షణ సాయం అందిస్తామని ఈటల హామీ ఇచ్చారు. సహాయక చర్యలు పూర్తి చేసి రెండ్రోజుల్లో తిరిగి ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని అన్నారు. ఎగ్జిబిషన్ కారణంగా రోజూ ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎగ్జిబిషన్ సొసైటీ వ్యాపార సంస్థ కాదని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో పద్దెనిమిది విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అనాథ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు ఈటల తెలిపారు.