Tollywood: నేను చేస్తున్న సాహితీ వ్యవసాయానికి ఓ గుర్తింపు దక్కింది: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు
- దర్శకుడు కె.విశ్వనాథ్ కి నమస్కరిస్తున్నా
- సినీ రంగాన్ని దేవాలయం కన్నా ఎక్కువగా ప్రేమిస్తా
సినీరంగంలో చేసిన సాహిత్య సేవలకు గాను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పురస్కారానికి తన పేరును సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి తన ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న సాహితీ వ్యవసాయానికి ఒక గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ రంగానికి తనను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కి నమస్కరిస్తున్నానని, అదే విధంగా తనకు పద్మశ్రీ పురస్కారం ఎందుకు ఇవ్వాలో కేంద్రానికి చెప్పిన ప్రతి ఒక్కరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తాను రాసిన ప్రతి పాటను అవార్డుగానే భావిస్తానని చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ రంగాన్ని దేవాలయం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పారు. ‘సినిమా’ అనేది సమాజానికి అద్దం లాంటిదని, దీని వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని అభిప్రాయపడ్డారు.