Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయం
- ఆస్తుల వేలం తర్వాత వాటిని తీసుకోవాలన్న యోచన
- కాపు రిజర్వేషన్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
గురువారం సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై తీవ్రంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేసి బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే, ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, రాజధాని ఆర్థిక ప్రణాళిక, పసుపు- కుంకుమ పథకం నిధుల పంపిణీ, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘భూధార్’ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.