Andhra Pradesh: ఏపీలో ప్రారంభమైన బంద్... స్తంభించిన రవాణాతో ప్రజల ఇబ్బందులు!
- హోదా, విభజన హామీలు అమలు చేయాలని బంద్
- మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
- నేడు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ ప్రారంభమైంది. ఈ బంద్ కు టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో, ఈ ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. రవాణా వ్యవస్థ నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు, రోడ్లపైకి చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ బస్టాండ్ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. బంద్ కు మద్దతు పలుకుతూ, నేడు సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరు కానున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్, పాఠశాలలు, కళాశాలల సంఘాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఏపీ ఎన్జీవో బంద్ కు మద్దతు పలకడంతో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా, ఈ బంద్ కు బీజేపీ, వైసీపీ, జనసేన మాత్రం దూరంగా ఉన్నాయి.