budget: ప్రతి వర్గానికి మేలు కలగాలన్నదే మా ఆశయం: పీయూష్ గోయల్
- దేశ సమగ్ర వికాసమే ప్రధాని మోదీ లక్ష్యం
- రైతులకు గొప్ప ఊరట కిసాన్ సమ్మాన్ నిధి పథకం
- ఈ పథకంతో 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుంది
ప్రతి వర్గానికి మేలు కలగాలన్నదే తమ ఆశయమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్ర వికాసమే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైందని, ఈ ఆర్థిక సాయం చిన్న రైతులకు గొప్ప ఊరట అని అన్నారు.
రైతుల కోసం తాము తీసుకున్న నిర్ణయం ఇంత వరకూ ఎవరూ తీసుకోలేదని, ఈ పథకం ద్వారా 12.5 కోట్ల మంది రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2018 డిసెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందించే పథకం కూడా చాలా గొప్పదని, దీని ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్ అన్నారు.