interim budget: తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉంది: మమతా బెనర్జీ
- నైపుణ్యాభివృద్ధి రంగంలో కోతలు విధించారు
- కేంద్రం మా పథకాలనే కాపీ కొట్టింది
- కేంద్ర నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్ కు సంబంధించి నైపుణ్యాభివృద్ధి రంగంలో కోతలు విధించారని, కేంద్రం తమ పథకాలనే కాపీ కొట్టిందని, పశ్చిమబెంగాల్ లో తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కొత్తగా ప్రకటించిందని విమర్శించారు.
సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర పథకం అని చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’, పశ్చిమ బెంగాల్ లో ముందు నుంచే అమల్లో ఉందని, ఆరోగ్య పథకం కింద రూ.5 లక్షల వరకు అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్ర ప్రభుత్వం తమ గొప్పలుగా చెప్పుకుంటోందని, మోదీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దుయ్యబట్టారు.