interim budget: ఆదాయపన్ను పరిమితి పెంపు మధ్య తరగతికి ఊరటనిచ్చే అంశమే: యనమల రామకృష్ణుడు
- ఇది ఎన్నికల బడ్జెట్
- ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు
- రైతుకు పెట్టుబడి సాయం ఎలా ఇస్తోందో చూడాలి
కేంద్రం ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఆదాయ పన్ను పరిమితిని పెంచడం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే అంశం అంటూనే, ఇది ఎన్నికల బడ్జెట్ అంటూ ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదని, ప్రత్యేక హోదా, విభజన అంశాలపై ప్రస్తావన లేదని విమర్శించారు.
కేంద్రం విచక్షణ మేరకు ఇచ్చే నిధులను బీజేపీయేతర రాష్ట్రాలకు ఇవ్వడం లేదని, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామన్న కేంద్రం ఎలా ఇస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని, నీతి ఆయోగ్ ప్రకారం అభివృద్ధి రేటు 9 శాతం మేర ఉండాలి కానీ, 7 శాతమే ఉందని అన్నారు. నిరుద్యోగ సమస్య వృద్ధి రేటు 6.1 శాతం మేర ఉందని, జాతీయ స్థాయిలో వ్యవసాయ అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని అన్నారు.