Chandrababu: ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు లేదు.. తేల్చేసిన చంద్రబాబు!
- రాజకీయ అనివార్యత వల్ల పొత్తు సాధ్యం కావడం లేదు
- జాతీయ స్థాయిలో మాత్రం అందరం కలిసే ముందుకెళ్తాం
- బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్కు దగ్గరయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బరిలోకి దిగారు.
దీంతో, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏపీలోనూ కాంగ్రెస్తో పొత్తు ఖాయమన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకున్నా.. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు రాజకీయ అనివార్యత వల్ల పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. అయితే, జాతీయ స్థాయిలో అందరం కలిసే ముందుకెళ్తామన్నారు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలన్న దానిపైనే తాము దృష్టి పెట్టినట్టు చెప్పారు. గతంలోనూ ఎన్నికలకు ముందు, ఇంకొన్నిసార్లు ఎన్నికల తర్వాత ఇలాంటి కూటములు ఏర్పాటైన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అందరం కలిసి జట్టుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని చంద్రబాబు వివరించారు.